swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 3:15 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు
స్వర్ణసాగరం శ్రీకాళహస్తి రూరల్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. బతైయ్య నాయుడు సోమవారం శ్రీకాళహస్తి మండలంలోని గోపాలకృష్ణపురం, ఉడవలపాడు, ముద్దముడి, ముచ్చివేలి, మంగళపూరి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఇటీవల పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పు చేస్తూ తీసుకువచ్చిన బిల్లును, ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఆమోదింపజేసి, అత్యవసరంగా రాష్ట్రపతి సంతకం కూడా చేయించుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్యగా డాక్టర్ బతైయ్య నాయుడు విమర్శించారు. మోదీ ప్రసంగాలు వాస్తవాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, ఆయన పాలనలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకు జరిగే న్యాయం శూన్యమని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మార్పుల వెనుక ఆ పథకాన్ని నీరుగార్చే కుట్ర దాగి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రజలకు వివరించి, మోదీ ప్రభుత్వ జిమిక్కులను బయటపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, వెంకట ముని, గోపి, శివయ్య, నాగూర్ అయ్యా, గురవయ్య, పెంచులమ్మ, బత్తెమ్మ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.