swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 9:57 am Digital Edition : DAMA VIJAYAKUMAR

వాస్తవాలు దాచిపెట్టి రాజకీయ ఆరోపణలు తగవు

— తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి కుంచం దయాకర్

స్వర్ణసాగరం, వాకాడు :

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న నిర్ణయాలను వక్రీకరించి, అసత్య ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కుంచం దయాకర్ మండిపడ్డారు. మంగళవారం నాడు ఆయన వాకాడు లో విలేకరులతో మాట్లాడుతూ
వైసీపీ సీనియర్ నేత కొడవలూరు భక్తవత్సల రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆవేశంతో చేసినవే తప్ప వాస్తవాలకు దూరమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ, అభివృద్ధి లక్ష్యంగానే తీసుకుంటున్నదని తెలిపారు.

*గూడూరు విభజన ప్రజల కోసమే*

గూడూరు విభజన వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్న వైసీపీ ఆరోపణలు నిరాధారమన్నారు. గత వైసీపీ పాలనలో జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేశారని, దాని వల్ల పరిపాలన గందరగోళంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలకు సేవలు వేగంగా అందాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశామని, గూడూరు విశిష్టతను తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా లేదన్నారు.

*ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పుపై అపోహలు*

ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పును రాజకీయ రంగు అద్దడం సరికాదన్నారు. పథకం పేరు మారినంత మాత్రాన పేదలకు ఉపాధి దూరమయ్యిందా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కొనసాగుతూనే ఉందని, పనిదినాలు, వేతనాలు ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వాటా పెంపుపై భయాలు చూపడం ద్వారా వైసీపీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని, ఆర్థిక క్రమశిక్షణతోనే పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు.

*రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ ద్వంద్వ వైఖరి*

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో వైసీపీ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని దయాకర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రాలేదని గుర్తు చేశారు. న్యాయపరమైన చిక్కులు, అంతర్రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా అప్పట్లో రాజకీయ ప్రకటనలు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం చట్టబద్ధంగా, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. వ్యర్థమని ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదని, ప్రాజెక్టు వినియోగంపై సమగ్ర అధ్యయనం జరుగుతోందని స్పష్టం చేశారు.

*రాజముద్ర పాస్ పుస్తకాలు రైతుల రక్షణ కోసమే*

రీసర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాల్లో భారీగా తప్పులు ఉన్నాయన్నది రైతులే అనుభవిస్తున్న వాస్తవమన్నారు. ఆ తప్పుల వల్ల రైతులు భూములు అమ్ముకోలేక, రుణాలు పొందలేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందుకే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది జగన్ బొమ్మ తొలగింపుకే పరిమితం కాదని, భూ హక్కుల భద్రత కోసమే రాజముద్ర పాస్ పుస్తకాలు తీసుకొచ్చామన్నారు. వందల కోట్ల దుర్వినియోగమన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని కొట్టిపారేశారు. వైసీపీకి ప్రజా సమస్యలపై నైతిక హక్కు లేదు తమ పాలనలో ఐదేళ్లు ప్రజలను పట్టించుకోని వైసీపీ నేతలు, ఇప్పుడు ప్రజాభిమానం పొందుతున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు ఇప్పటికే ఎవరు అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలిచారో, ఎవరు పరిపాలనను సరిదిద్దుతున్నారో స్పష్టంగా తీర్పు ఇచ్చారని కుంచం దయాకర్ స్పష్టం చేశారు.