swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 8:40 am Digital Edition : RAMESH THOTTAMBEDU

సహకార సంఘాల కార్యాలయాలకు తాళాలు,

రెండున్నర నెలల ఆందోళనకూ స్పందన శూన్యం,

డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు హెచ్చరిక,

స్వర్ణసాగరం – తొట్టంబేడు,

ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన మళ్లీ ఉధృతమైంది. దాదాపు రెండున్నర నెలలుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన సమ్మె చేపట్టినట్లు ఉద్యోగులు ప్రకటించారు.
ఇప్పటివరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద, గుంటూరులోని ఆర్‌సీఎస్ కార్యాలయం వద్ద పలు దఫాలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదని వారు ఆరోపించారు. తమ డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, సహకార రంగాన్ని బలోపేతం చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పప్పు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ, “ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు ప్రారంభించాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ సిబ్బంది శ్రీనివాసులు, శేఖర్‌బాబు, వాసు, భాస్కర్, దివ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.