యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల విజేతలను సోమవారం ప్రకటించారు. ఈ 98వ ఆస్కార్ పండగకు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా నిలిచింది. ఈ వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహ రించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పురస్కారాన్ని ప్రియాంక చోప్రా అందజేశారు. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలకు అవార్డుల పంట పండింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఆరు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకుంది
అరుదైన రికార్డుతో జోర్డాన్
ఉత్తమ నటుడిగా నిలిచిన మైఖేల్ బీ జోర్డాన్ ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన సిన్నర్స్ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఒకే చిత్రంలో కవలలుగా నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతీయుడిగా నిలిచారు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన జోర్డాన్ వెండి తెరపై ఆస్కార్ అవార్డుతో ప్రతిభ చాటుకున్నారు. మార్వెల్ చిత్రం ‘బ్లాక్ పాంథర్’లో జోర్డాన్ పోషించిన ‘కిల్‌మాంగర్’ పాత్ర హాలీవుడ్ చరిత్ర లోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచి పోయింది. సామాజిక సందేశాన్నిచ్చే చిత్రాల్లో నటిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్పెషల్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. హీరోగా బిజీ ఉన్న సమయంలోనే విలన్‌గా నటించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగాను రాణించారు.
ఏడోసారీ ‘టై’ అవార్డు
ఈ వేడుకల్లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ‘ఒకే కేటగిరీకి’ ఇద్దరు విజేతలుగా నిలిచారు. ఈ జాబితా టై అయింద’ని చెప్పడంతో.. డాల్బీ థియేటర్ చప్పట్లతో మారు మోగింది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఏడోసారి ఈ అరుదైన ‘టై’ చోటుచేసుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో విజేతలకు నటుడు కుమాయిల్ నంజియాని అవార్డును అందించారు. ఈ అవార్డుకు ‘ది సింగర్స్’, ‘టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా’ చిత్రాలు ఎంపికయ్యాయి.
తండ్రీ కూతుళ్ల బంధానికే ఉత్తమ చిత్రం
ఈ వేడుకల్లో ఆరు ‘ఆస్కార్’లు అందుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం తండ్రీ కూతుళ్ల భావోద్వేగంతో నిండిపోతుంది. బిడ్డ నమ్మకం గెలుచుకోవడం కోసం ఓ తండ్రి పడే తపనను ఎంతో హృద్యంగా తీర్చిదిద్ది ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు పాల్ థామస్ అండర్సన్. బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు. సొంతబిడ్డగా పెంచుకున్న చార్లీన్‌ను కాపాడేందుకు తండ్రి ఏం చేస్తాడు? ఆ పోరాటంలో అతని ఆలోచనలు, సంబంధాలు, నైతిక విలువలు ఎలా మారతాయి? స్వార్థం తన పరిస్థితులను ఎలా మార్చేసింది? తల్లి మీద కోపం, పెంచిన తండ్రి మీద అనుమానంతో ఎటూ తేల్చుకునే స్థితిలో ఉన్న చార్లీన్ నమ్మకాన్ని ప్యాట్ ఎలా గెలుచుకోగలిగాడు? అన్నదే ఈ చిత్ర కథ. 2000 నాటి ‘వైన్‌లాండ్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది సెప్టెంబరు 26న వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. 130-175 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 209.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించకపోయినా.. అండర్సన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అటు విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక పురస్కారాలు సాధించింది. 31వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో 3, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నాలుగు, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల్లో ఆరు విభాగాల్లో గెలుపొందింది.
భారతీయ నటులకు ఆస్కార్ నివాళి
ఈ వేడుకలో In Memoriam సెగ్మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచింది.
ఉత్తమ చిత్రాలు
ఉత్తమ చిత్రం : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ దర్శకుడు : పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ నటుడు : మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)
ఉత్తమ నటి : జెస్సీ బక్లీ (హామ్నెట్)
ఉత్తమ సహాయ నటుడు : సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి : ఎమీ మాడిగన్ (వెపన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : కేపాప్ డిమాన్ హంటర్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : ఫ్రాంకెన్‌స్టైయిన్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : ఫ్రాంకెన్‌స్టైయిన్
ఉత్తమ క్యాస్టింగ్ : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఉత్తమ సౌండ్ : ఎఫ్ 1
ఉత్తమ ఎడిటింగ్ : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : సిన్నర్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : అవతార్ ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : సిన్నర్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ఫ్రాంకెన్‌స్టైయిన్