విజయవాడ : మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా ఎల్‌పిజి సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగింది. దీని కారణంగా చిన్న హోటళ్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్లు తమ కార్యకలాపాలు తగ్గించుకోవాల్సి రావడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు గణనీయంగా పడిపోయాయి. ఒకటేమిటీ … చిన్న బండ్ల వ్యాపారాల నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు పొట్టపోషించుకునే కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది..!
అక్రమ వ్యాపారాలు, బ్లాక్ మార్కెట్లు ….
గ్యాస్ కొరతను అవకాశంగా తీసుకున్న కొందరు అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్‌ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు. బ్లాక్‌లో గ్యాస్ బండ కొనలేకపోతున్నాం …. రేట్లు పెంచుతుంటే కొనుగోలు తగ్గుతోంది… ఫలితంగా నష్టమే మిగులుతుంది… అంటూ చిరు వ్యాపారులంతా గగ్గోలుపెడుతున్నారు. పూల దుకాణం నుండి కాయగూరలు ఒకటేమిటీ … అన్ని రంగాల జీవనోపాధులు గ్యాస్ సిలిండర్ల దెబ్బకు కుదేలవుతున్నాయి.
ఆర్డర్లే లేవు : డెలివరీ సిబ్బంది
హోటళ్లలో వంటలు తగ్గడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆర్డర్లు తగ్గిపోయాయి. గతంలో రోజుకు 30 నుంచి 40 ఆర్డర్లు చేసేవారికి ఇప్పుడు 20 కూడా రావడం లేదని డెలివరీ సిబ్బంది చెబుతున్నారు. గంటల తరబడి యాప్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఆర్డర్లు రాకపోతే డెలివరీ తగ్గుతుంది.. దాని ప్రభావం వారి జీతాలపై పడుతుంది.. జీవన పోరాటం చేసేదెలా అంటూ …. డెలివరీ సిబ్బంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరో భారంగా కరెంటు బిల్లులు …
ఈ సంక్షోభం డెలివరీ కార్మికులతో పాటు క్లౌడ్ కిచెన్లలో పనిచేసే ఉద్యోగులు, వీధి వ్యాపారుల జీవనాధారాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. కొందరు ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నప్పటికీ పెరిగిన విద్యుత్ బిల్లులు మరో భారంగా మారుతున్నాయి. కట్టెల పొయ్యిలు పెడదామన్నా… ఇప్పుడు కట్టెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. కరెంటు పొయ్యిలు వాడదామంటే పెరిగే కరెంటు బిల్లు తలుచుకుంటేనే గుండె గుభేలుమంటోందంటూ ఉద్యోగులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో పొయ్య మండనిదే ఉద్యోగాలకు పోలేం… కొట్లో పొయ్య వెలగందే వ్యాపారం చేయలేం… అంటూ జనాలు వాపోతున్నారు.
బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోండి : కార్మిక సంఘాలు
గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్‌పీజీ దిగుమతులను పెంచాలని, ఆదాయం కోల్పోయిన అన్ని రంగాల కార్మికులకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు.