swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 8:04 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

శ్యామసుందరపురం కాలనీలో పడకేసిన పారిశుధ్యం-ఎక్కడ చెత్త అక్కడే

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 11

కోట మండలం శ్యామసుందర పురం కాలనీలో పారిశుద్ధ్యం తీవ్రంగా పడకేసింది.దీనివల్ల చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోయి ప్రజలు అంటువ్యాధుల భయంతో జీవిస్తున్నారు. పంచాయతి అధికారులు,నిర్లక్ష్యం,కాలువల పూడిక సరిగ్గా తీయించకపోవడం,పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఎప్పుడో ఒకసారి డ్రైనేజీ కాలువలను నామమాత్రంగా పైపైనే శుభ్రం చేయడం వలన కాలవల బండల కింద విపరీతంగా మురికి చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తూ దోమలు బెడద ఎక్కువైందని తద్వారా అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెత్తను తరలించేందుకు రిక్షాను ఇచ్చిన ఎక్కడ కానరాని పరిస్థితిలో రిక్షా ఉందని అంటున్నారు.కాలనీలో చెత్తకుండీలు లేకపోవడంతో కనీసం ప్రభుత్వం ప్రజలకు అందించిన తడి పొడి చెత్త గ్రీన్ అండ్ బ్లూ ప్లాస్టిక్ బుట్టలు కూడా ప్రజలకు ఇవ్వకపోవడంతో కాలనీ మొత్తం చెత్త చెదారం రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి.వార్తాపత్రికలలో కథనాలు వస్తేనే లేక ప్రజలు తమ సమస్యను మొరపెట్టుకుంటేనే దోమల మందులు పిచికారి చేయడం బ్లీచింగ్ వంటివి పిచికారి చేయడం వంటి కార్యక్రమాలకు తూతూ మంత్రాలుగా  అధికారులు శ్రీకారం చుడుతున్నారని లేకపోతే ప్రజలను పట్టించుకునే నాధులే లేరని శ్యామసుందరపురం కాలనీవాసులు వాపోతున్నారు.కరోనా సమయంలో కాలనీలో బ్లీచింగ్ పిచికారి చేసిన తర్వాత ఇటీవల స్వర్గధామం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విచ్చేయుచున్న సందర్భంగా ఓసారి కాలనీ మెయిన్ రోడ్డుపై బ్లీచింగ్ పిచికారి చేయడం జరిగిందని కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా శానిటేషన్ పనులు నిర్వహించడం లేదని కాలనీ ప్రజలు పంచాయతీ అధికారులపై మండిపడుతున్నారు. పంచాయతీ అధికారులు చొరవ తీసుకొని కాలనీలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించి ప్రజలను అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడాలని శ్యామసుందరపురం కాలనీ ప్రజలు కోరుతున్నారు.