శ్రీసిటీ,స్వర్ణ సాగరం ఏప్రిల్ 21, 2026 :
జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JETRO – జెట్రో) కు చెందిన జెట్రో చెన్నై విభాగం డైరెక్టర్ జనరల్ కియోటాకా దోహో, డిప్యూటీ డైరెక్టర్ కెన్ తమురా, అడ్వైజర్ యోషిహికో ఫుజీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శివశంకర్ వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలు, ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలతో పాటు ఇక్కడ పెట్టుబడిదారుల అనుకూల పర్యావరణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ గురించి వివరించారు. పలు ప్రయోజనాల దృష్ట్యా ప్రపంచ పెట్టుబడిదారులు, ముఖ్యంగా జపాన్ సంస్థలు శ్రీసిటీని తమ గమ్య స్థానంగా ఎంచుకొంటోందని వెల్లడించారు. జెట్రో లాంటి సంస్థలు ఈ విషయాలను జపాన్ పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహాయ పడతాయని తెలిపారు. జెట్రో ఉన్నతాధికారుల పర్యటనను తాము అత్యంత గౌరవప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. వారి ప్రశంసలు శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌళిక వసతులు, సుస్థిర అభివృద్ధిపై తమ నిబద్ధతను మరింత బలపరుస్తున్నాయి అన్నారు. ఇక్కడ జపాన్ సంస్థలు విస్తరిస్తున్న నేపథ్యంలో, శ్రీసిటీ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా ఇండో-జపాన్ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.శ్రీసిటీ మౌళిక సదుపాయాలపై కియోటాకా దోహో సంతృప్తిని వ్యక్తం చేసారు. శ్రీసిటీ దేశంలోనే రెండవ అతిపెద్ద జపనీస్ టౌన్‌షిప్ గా రూపుదిద్దుకోవడం, ఇక్కడ ఏర్పాటైన అనేక జపాన్ సంస్థలు తమ తయారీ యూనిట్ల విస్తరణ చేపడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ ప్రతినిధుల కోసం నిర్మితమవుతున్న సామాజిక మౌళిక సదుపాయాలైన సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, వినోద సౌకర్యాలు, గోల్ఫ్ డ్రైవింగ్ రేంజ్ మొదలైన వాటిని బృంద సభ్యులు ప్రశంసించారు.పర్యటనలో శ్రీసిటీ పరిసరాలతో పాటు జపాన్ కు చెందిన ఐసాన్ పరిశ్రమను వీరు సందర్శించారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా, వీరు ఎంతో ఆసక్తితో శ్రీసిటీ గురించి పలు అంశాలపై ప్రశ్నలడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. కాగా, జెట్రో అనేది జపాన్ మరియు ఇతర దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను ప్రోత్సహించే జపాన్ ప్రభుత్వ మద్దతు గల ప్రత్యేక సంస్థ.