శ్రీసిటీ,స్వర్ణ సాగరం మార్చి 31, 2026:
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల పరిశీలనలో భాగంగా తైవాన్ దేశానికి చెందిన ఐదుగురు వ్యాపార ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ నాన్-వోవెన్ ఫాబ్రిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (టిఎన్ఎఫ్ఏ) సంస్థ చైర్మన్ షెల్లీ చియన్ నేతృత్వంలో విచ్చేసిన వారికి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికారు.పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా శ్రీసిటీ ప్రత్యేకతలను వివరిస్తూ శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) బోడ్గన్ జార్జ్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీసిటీ వ్యూహాత్మక స్థానం, వివిధ రంగాల పరిశ్రమలు, అత్యుత్తమ సామాజిక మౌళిక సదుపాయాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పారిశ్రామిక అనుకూల విధానాలను హైలైట్ చేశారు. అంతర్జాతీయ తయారీరంగ పరిశ్రమలకు గమ్యస్థానంగా శ్రీసిటీ ప్రాధాన్యతను విశదీకరించారు. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ సంస్థ శ్రీసిటీలో డైకిన్ తో కలిసి ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని వారి దృష్టికి తెచ్చారు. వీరి పర్యటన చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది శ్రీసిటీ, తైవాన్ మధ్య ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ప్రణాళికాబద్ధ అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రో-యాక్టివ్ దృక్పథాన్ని ప్రశంసించిన షెల్లీ చియన్, శ్రీసిటీ సందర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అద్భుతమని కొనియాడారు. తమ పెట్టుబడులకు శ్రీసిటీ అనువైన కేంద్రంగా భావిస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటు కోసం తప్పక పరిశీలిస్తామని తెలిపారు. పర్యటనలో భాగంగా, తైవాన్ ప్రతినిధులు శ్రీసిటీ అధికారులతో పరస్పర చర్చలు జరిపారు. పెట్టుబడి అవకాశాలు, మౌలిక వసతుల విస్తరణ, ఇతర వ్యాపార అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను, పారిశ్రామిక కార్యకలాపాలను నేరుగా వీక్షించారు. తైవాన్ బృందంతో పాటు ఇన్వెస్ట్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ప్రతినిధులు పర్యటనలో పాల్గొన్నారు.