swarnasagaram.com
Date of Publish : 28 June 2026, 9:54 am Posted by : Pakam chennakesavulu Kota Mandal

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయిద్దాం- పోలియోను తరిమికొడదాం -ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్

కోట స్వర్ణసాగరం జూన్ 28

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమికొడదామని ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్ అన్నారు.కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో ఆదివారం ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా షేక్ శంషుద్దీన్ మాట్లాడుతూ పోలియో అనేది చిన్నారులను జీవితాంతం వికలాంగులుగా మార్చే ప్రమాదకరమైన వ్యాధి.ఈ వ్యాధిని పూర్తిగా నివారించే శక్తి కేవలం రెండు పోలియో చుక్కలకే ఉందని, అందుకే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి ఉచితంగా పోలియో చుక్కలు వేస్తోందన్నారు.మన దేశం పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ,ఈ వ్యాధి మళ్లీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.ఇప్పటికే సాధారణ టీకాలు వేయించిన పిల్లలకు కూడా పల్స్ పోలియో రోజున మరోసారి ఈ చుక్కలు వేయించడం అత్యంత అవసరమని అన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రానికి తీసుకెళ్లి చుక్కలు వేయించడం ద్వారా వారి భవిష్యత్తును సురక్షితం చేయవచ్చన్నారు.అలాగే ప్రతి ఒక్కరూ తమ బంధువులు,స్నేహితులు, పొరుగువారికి కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేసి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు షేక్ శంషుద్దీన్,దారా సురేష్,టీడీపీ నాయకులు నౌషాద్,మోహన్,శ్రీనివాసులు, వంశీ,సుహాసిని,వైద్య సిబ్బంది,ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది,చిన్నారుల తల్లితండ్రులు పాల్గొన్నారు.