💥ఎస్సీ గురుకులాన్ని ఎత్తివేసి దళిత జాతి కడుపు కొట్టొద్దు
🛑ఎంతో మంది అణగారిన వర్గాల విద్యార్థులు ఇక్కడ చదివి నేడు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు
🛑ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్సీ గురుకులాన్ని ఎత్తివేయడం బహుజనులకు తీరని ద్రోహం
కోట స్వర్ణసాగరం,జూలై 24:
కోట మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేయాలనే నిర్ణయంపై బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరామ్ శివప్రసాద్(శంకర్)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్సీ గురుకులాన్ని మూసివేయడం ద్వారా దళిత,అణగారిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును చీకటిలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం ఎస్సీ గురుకులం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరామ్ శివప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ గురుకులాన్ని ఎత్తివేసి దళిత జాతి కడుపు కొట్టొద్దు.పేద,అణగారిన కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఈ విద్యాసంస్థలో చదువుకుని నేడు ఉన్నత స్థానాలకు చేరుకుని రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగారు.అలాంటి గొప్ప చరిత్ర కలిగిన విద్యాసంస్థను ఎత్తివేయడం బహుజన సమాజంపై జరుగుతున్న తీవ్రమైన అన్యాయం అని అన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ నిర్ణయాన్నైనా బహుజన సమాజం సహించబోదని స్పష్టం చేశారు.దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఎస్సీ గురుకులాల పాత్ర ఎంతో కీలకమని,వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటినే మూసివేయాలని ప్రయత్నించడం బాధాకరమన్నారు.గురుకులాన్ని వెంటనే పునరుద్ధరించి,విద్యార్థులకు యథావిధిగా విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత,బహుజన సంఘాలను ఐక్యం చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి, ఎస్సీ గురుకులాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు.దళిత విద్యార్థుల విద్యా హక్కులను కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని,ఆ బాధ్యతను విస్మరించరాదని ఆయన పేర్కొన్నారు.