💥మెయిన్ రోడ్డుపై దుర్వాసన వెదజల్లుతున్న చెత్తతో నిండిన కాలువ
🔶సచివాలయం,పంచాయతీ సిబ్బంది పట్టించుకోవట్లేదంటూ ప్రజల ఆగ్రహం
కోట స్వర్ణసాగరం ఆగష్టు 3
కోట మండలం చిట్టేడు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు,మురుగు పేరుకుపోవడంతో మురుగునీరు సరిగా ప్రవహించక నిల్వ ఉండిపోయింది.దీంతో దుర్వాసన భరించలేని స్థాయికి చేరిందని,ప్రధాన రహదారిపై ప్రయాణించే ప్రజలు,వ్యాపారులు,స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన పంచాయతీ ప్రత్యేక అధికారి,సచివాలయ సిబ్బంది ఈ సమస్యపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు.
దుర్వాసన కారణంగా దోమలు,ఈగలు అధికంగా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉన్నందున వెంటనే కాలువను శుభ్రం చేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతో పాటు గ్రామ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.