స్వర్ణ సాగరం —తొట్టంబేడు,
మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లి గ్రామం హరిజనవాడ నాగాలమ్మ పుట్ట సమీపంలో ఆర్&బి రోడ్డుకు గండి పడింది.
వర్షపు నీరు ఊరువీధుల్లోకి చేరి రోడ్డు భాగం దెబ్బతిన్నందున వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న మండల అభివృద్ధి అధికారి పి. సురేంద్రనాధ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపై నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరాలు సేకరించారు.స్థలంలోనే ఆర్&బి అధికారులకు ఫోన్ చేసి తక్షణ మరమ్మత్తు పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రజలకు అవాంతరాలు కలగకుండా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులు శివశంకర్ రెడ్డి, హరిబాబు లకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను కారణంగా గ్రామంలో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం గమనించిన ఎంపీడీవో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వర్షపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.అదేవిధంగా ఆయన కంచనపల్లి మరియు బోనుపల్లి హరిజనవాడ గ్రామాలను సందర్శించి రోడ్ల పరిస్థితి, పారిశుద్ధ్య పనులను సమీక్షించారు.గ్రామాల్లో చెత్త నీటి నిల్వలపై వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తదనంతరం చిట్టత్తూరు రోడ్డుపై ప్రవహిస్తున్న వరద ప్రవాహాన్ని కూడా పరిశీలించారు. ఆ రహదారిపై ప్రయాణించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షం ఆగే వరకు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున తుఫాను కారణంగా రహదారుల మరమ్మత్తులపై తక్షణ నివేదిక పంపించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
తుఫాను కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు తగిన నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.
స్థల పరిశీలనలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక యువకులు పాల్గొన్నారు.




