* గూడూరు విభజనతో విశిష్టతకు భంగం
* ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పు దురదృష్టకరం
* రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యర్థం అనడం బాధాకరం
* రాజముద్ర పాసుబుక్కుల్లో డొల్లతనం
* వైసీపీ నేత కొడవలూరు వ్యాఖ్యలు
వాకాడు స్వర్ణసాగరం
రాష్ట్ర పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు చారిత్రిక తప్పిదాలుగా మిగలనున్నాయని ప్రభుత్వం నిర్ణయాలతో జరగనున్న ఈ ప్రాంత నష్టాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని విజ్ఞులందరూ ముందుకు నడవాలని వైసిపి సీనియర్ నేత, ఆ పార్టీ ఎస్ ఈ సి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి సూచించారు. కూటమిపాలనపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న జిల్లాల పునర్విభజనలో భాగంగా గూడూరు విభజనతో గూడూరు డివిజన్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, సబ్ డివిజన్ గా కోట, వాకాడు, చిట్టమూరులోని ప్రధాన కార్యాలయాలు ప్రజా సేవకు దూరం కానున్నాయన్నారు. జిల్లా కేంద్రం దూరం అన్న సాగుతో చేసిన విభజన వల్ల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన గూడూరు తన విశిష్టతను కోల్పోయిందన్నారు. ఈ విభజనలో జేఏసీ కీలక పాత్ర వహించిందని.. వారి పాత్ర ద్వారా విభజిత గూడూరు ప్రజలకు ఎంత మేరకు ప్రయోజనకరంగా ఉంటుందో వారు ఆలోచించుకోవాలన్నారు. కావున ప్రజా నిర్ణయాలకు అనుకూలంగా, గూడూరు ప్రయోజనాలకు అనుగుణంగా, జేఏసీ మద్దతుతో గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాలతో కలసి ఒకే జిల్లాలో ఉండేలా విజ్ఞులందరూ కలిసి సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పు దురదృష్టకరం:
దేశంలో పేదల వలసలను తగ్గించేందుకు 2009లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగిందని, ప్రతి పేదవాడికి ఈ పథకం ద్వారా 100 రోజులపాటు పని కల్పించడం చేత వెనుకబడిన ప్రాంతాలకు కాస్త ఉపశమనం లభించిందని, ప్రస్తుత ఎన్ డి ఏ ప్రభుత్వం దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఉన్న ఈ పథకాన్ని వి బి జి రాంజీ పేరుతో మార్పు చేయడం దురదృష్టకరమని భక్తవత్సల రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కొరకు కేటాయించే నిధులు 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించి వినియోగించుకోవడమే భారంగా మారుతుంటే ప్రస్తుతం మార్పు చేసిన చట్టంలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపులు ఎలా సాధ్యమవుతాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ పథకానికి చరమగీతం పాడే ప్రయత్నాలు మోడీ ప్రభుత్వం చేపడుతుందని ఆయన తెలిపారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యర్థం అనడం బాధాకరం:
78 టీఎంసీల సామర్థ్యంతో ఉత్తర నెల్లూరు ప్రాంతాలకు నీరు అందించే సోమశిల జలాశయం, 60 టీఎంసీల సామర్థ్యంతో దక్షిణ నెల్లూరు ప్రాంతాలకు నీరు అందించే కండలేరు జలాశలయాలకు అనుసంధానమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ రెండు జలాశయాలకు 150 టిఎంసిల నీరు నింపితే, వర్షాలు పడకపోయినా 50 లక్షల ఎకరాలకు రెండు సంవత్సరాలకు సాగు నీరు అందించవచ్చని అంతటి ప్రయోజనం ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీటిని వినియోగించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కోర్టుకు వెళ్లి తీసుకు వచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం, దాన్ని సమర్ధించుకుంటూ తెలుగుదేశం నేతలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యర్థమని వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. అందులోనూ 8 వందల కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా జరిగి ఉండటం విశేషం.
రాజముద్ర పాస్ పుస్తకాల్లో డొల్లతనం:
రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రైతులకు అందించిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో 70% తప్పులు దొర్లాయన్నది వాస్తవమేనని, దాన్ని బూచిగా చూపించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఈ అంశాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందిందన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రీసర్వే లో తప్పిదాలను తొలగించి రాజముద్రతో రైతుకు పాసుపుస్తకాలు అందజేస్తామని చెప్పడం సంతోషకరమే, కానీ వందల కోట్లు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రాజముద్రతో రైతులకు అందించిన పట్టాదారు పాస్ పుస్తకాలలో జగన్ బొమ్మ తప్ప మిగతా ఏది మారలేదని ఆయన నిరూపిత అంశాలను బహిర్గతం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మను తొలగించేందుకు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కూటమి ప్రభుత్వం తప్పిదమేనని వ్యాఖ్యానించారు. ఈ తప్పిదాలు సవరించకపోవడంతో రైతులు తమకున్న భూమిని తమ వ్యక్తిగత అవసరాలకు అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక, ఇప్పటికే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక, నాన్న అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు.
కూటమి పాలన నిర్ణయాలు చారిత్రిక తప్పిదాలు
RELATED ARTICLES



