గురవయ్యకు కోట, మండల టిడిపి నేతల హెచ్చరిక
కోట, స్వర్ణసాగరం ఆగస్టు 14:
గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గురవయ్య ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, యువ నాయకుడు నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై జిల్లా మైనారిటీ నేత జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం కోట మండల చెందిన దళిత, స్థానిక టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా వ్యవహరించాలని, వైఖరి మార్చుకోకపోతే ప్రజల నుంచి తగిన సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.గురవయ్యకు పార్టీ అధిష్ఠానం అప్పగించింది కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత మాత్రమేనని, అంతకుమించి అధిష్ఠానం స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని టిడిపి నేతలు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ నాయకులను కలుసుకుని, ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించాలని సూచించారు.గురవయ్యకు వయసు, రాజకీయ భవిష్యత్తు ఉన్నాయని, ఇతరుల వెనుక ఉండి రాజకీయాలు చేయకుండా సొంత వ్యక్తిత్వంతో ఎదగాలని హితవు పలికారు. ఇతరుల ప్రోద్బలంతో వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గంలో నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాల తర్వాత అభివృద్ధి విషయంలో దళిత నాయకుడిగా ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ గుర్తింపు పొందారని నేతలు పేర్కొన్నారు. సునీల్ స్థానిక నాయకుడని, ఆయనపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. మైక్ చేతికి వచ్చిందనే ఉద్దేశంతో హద్దులు దాటి మాట్లాడటం సరికాదని, వ్యక్తిగత విమర్శలకు బదులుగా అభివృద్ధి అంశాలపై రాజకీయ పోటీ ఉండాలని సవాల్ విసిరారు. భవిష్యత్తులో మరోసారి నోరు జారితే ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని దళిత, స్థానిక నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, టిడిపి ఎంపీటీసీలు, వాకాడు ఏఎంసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు



