. @ చైర్మన్ డాక్టర్ పి. గుణిశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..
. @ సందడి చేసిన హీరోయిన్ హెబ్బా పటేల్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిలు
కోవూరు, స్వర్ణ సాగరం:
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన సంక్రాంతి పండుగ వేడుకలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అయిన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఎస్వి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి. గుణిశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో శనివారం కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది హాజరయ్యారు. హైపర్ ఆది తన మార్కు హాస్యంతో, హెబ్బా పటేల్ తన నృత్యంతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. అలాగే ‘అనుకోని నిజం అనుకోనా’ సినిమా హీరోయిన్ రేణు ప్రియ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథులను చైర్మన్ డాక్టర్ పి. గుణిశేఖర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ పి. గుణిశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు మన దేశ సాంస్కృతిక విలువలను అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఏటా తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను ఒక వేడుకలా నిర్వహిస్తు న్నామని, విద్యార్థులు తమ మూలాలను మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడ తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కళాశాల గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ పి. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో సంక్రాంతి ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది అందరూ కలిసి సాంప్రదాయబద్ధంగా పొంగలి వండి పండుగ వాతావరణాన్ని పెంచారు. విద్యార్థినుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు చైర్మన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని, డాక్టర్ పి. గుణిశేఖర్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు.



