ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్ఎస్సీ గురుకులం ఎత్తివేతపై కన్నీటితో తల్లిదండ్రుల రెండో రోజు భగ్గుమన్న నిరసన

ఎస్సీ గురుకులం ఎత్తివేతపై కన్నీటితో తల్లిదండ్రుల రెండో రోజు భగ్గుమన్న నిరసన

📰 Generate e-Paper Clip

దళిత విద్యా హక్కులను కాలరాస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తాం–బహుజన యూత్ ఫోర్స్ హెచ్చరిక

కోట స్వర్ణసాగరం జూలై 22:

కోట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహుజన యూత్ ఫోర్స్ (బి.వై.ఎఫ్) ఆధ్వర్యంలో రెండో రోజు కూడా ఆందోళనలు ఉధృతంగా కొనసాగాయి.గురుకుల విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురుకులం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియని ఆందోళనలో ఉన్నామని,అకస్మాత్తుగా గురుకులాన్ని మూసివేయడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాన్ని పునరుద్ధరించాలని వేడుకున్నారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ,పేద దళిత విద్యార్థుల చదువుతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోం.ఎస్సీ గురుకులాల మూసివేత అనేది దళితుల రాజ్యాంగ బద్ధమైన విద్యా హక్కులపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి.రాజ్యాంగం కల్పించిన విద్యా అవకాశాలను కాలరాయడం సామాజిక న్యాయానికి విరుద్ధం అని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని కోట ఎస్సీ గురుకుల పాఠశాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
గురుకులం మూసివేత అంటే దళిత విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు.పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే గురుకులాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటినే మూసివేయడం అత్యంత దురదృష్టకరం.విద్యా హక్కును హరిస్తే ప్రజా ఉద్యమమే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతుంది అని పేర్కొన్నారు.దళిత పిల్లల చదువుపై నిర్లక్ష్యం చూపడం సమాజ భవిష్యత్తును దెబ్బతీయడమేనని,పిల్లల కన్నీళ్లు,తల్లిదండ్రుల ఆవేదనకు కారణమైన వారిని కాలం క్షమించదు.దళిత విద్యార్థుల హక్కుల కోసం ఎంతదూరమైనా పోరాడతాం. కోట ఎస్సీ గురుకులాన్ని పునరుద్ధరించే వరకు మా ఉద్యమం ఆగదు,తగ్గదు అని కరాకండిగా స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఐవీ రమణయ్య,దాసరి అశోక్ కాంబ్లే,దళిత సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,తల్లిదండ్రులు,స్థానిక ప్రజలు పాల్గొని గురుకుల పాఠశాల పునరుద్ధరణ కోసం ఏకగ్రీవంగా తమ గళాన్ని వినిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గురుకులాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular