శ్రీసిటీ,స్వర్ణ సాగరం ఏప్రిల్ 18, 2026:
తెలుగు ఉగాదిని పురస్కరించుకుని యేటా శ్రీసిటీలో నిర్వహించే ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందచేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేతుల మీదుగా ప్రముఖ పద్య నాటక కళాకారులు డాక్టర్ మీగడ రామలింగస్వామి , హరికథా భాగవతార్ డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి , ఆధ్యాత్మికవేత్త కందాడై సెల్వన్ , జానపద కవి గాయకులు పోల్లూరు జగన్నాధం పురస్కారాలను అందుకున్నారు. విశాఖపట్నంకు చెందిన కళారత్న డా. మీగడ రామలింగ స్వామి 47 ఏళ్లుగా తెలుగు పద్యనాటక రంగంలో కవి, నటుడు, దర్శకుడు, గాయకుడు, రచయితగా విశిష్ట సేవలు అందించారు. గుంటూరు వాసి, తిరుపతి ఎస్వీ సంగీత కళాశాల మాజీ ప్రధానాచార్యులు ముప్పవరపు సింహాచల శాస్త్రి హరికథలో నాలుగు దశాబ్దాల అనుభవం, రామాయణం మరియు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యులు. ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు, మంగళంపాడుకు చెందిన కందాడై సెల్వన్ 36 సంవత్సరాల ఉపాధ్యాయ సేవ అనంతరం దివ్యప్రబంధాన్ని తెలుగులోకి అనువదిస్తూ గ్రామీణ ప్రజలకు శ్లోకాలు, స్తోత్రాలు బోధిస్తున్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం నివాసి, ప్రభుత్వ ఉపాద్యాయుడు, ప్రజాకవి, గాయకుడు అయిన పొల్లూరు జగన్నాథం జానపద గాయకులుగా సుపరిచితులు. AIR, ETV మాద్యమాల్లోను తన కార్యక్రమాలు ప్రసారమై గుర్తింపు పొందారు.పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సన్నారెడ్డి, ప్రముఖులను సత్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా ఎదుగుతున్న శ్రీసిటీ, మంచి నివాసయోగ్య ప్రాంతంగా రూపుదిద్దుకునే క్రమంలో కళలను ప్రోత్సహిస్తూ శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ప్రతినెలా నిర్వహించే శ్రీవాణి కార్యక్రమాల్లో శ్రీసిటీ పరిధిలోని ఉద్యోగులు, గృహిణిలు, విద్యార్థులు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు.పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధితో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తూ శ్రీవాణి వేదిక ద్వారా ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలను చేపట్టడం పట్ల శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని అభినందించారు. శ్రీసిటీలో పచ్చదనం, సమగ్ర ప్రణాళికతో కూడిన అభివృద్ధిని ప్రశంసించారు. తమ ప్రతిభను గుర్తించి ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ఉద్యోగులు, వారి కుటుంబీకులు, పరిసర గ్రామాలతో పాటు సూళూరుపేట, శ్రీహరికోట, చెన్నై నుంచి పలువురు సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. శ్రీసిటీ పీఆర్వో పల్లేటి బాలాజీ కార్యక్రమ ప్రయోక్తగా వ్యవహరించారు.
శ్రీసిటీలో శ్రీవాణి ఉగాది పురస్కారాల వేడుక – పలువురి ప్రముఖులకు పురస్కారాల ప్రదానం
RELATED ARTICLES



