🔷మౌనం వీడని ఆర్.అండ్.బి అధికారులు…మూల్యం చెల్లిస్తున్న ప్రజలు..!
🔷విద్యానగర్ ప్రధాన రహదారి దుస్థితి…స్పందించని అధికారులు
కోట స్వర్ణసాగరం జులై 20
కోట మండలంలోని విద్యానగర్ సెంటర్ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలతో చెరువును తలపిస్తోంది.ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ వందలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది.గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆటోలు,ఇతర వాహనాలు కూడా నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అత్యవసర సేవల వాహనాలకు సైతం ఈ రహదారి ఇబ్బందిగా మారిందని స్థానికులు చెబుతున్నారు.ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు.ప్రధాన రహదారి ఇంత దారుణంగా మారినా అధికారులు ఎందుకు స్పందించడం లేదు.ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలా,
ప్రజల ప్రాణాల కంటే నిర్లక్ష్యమే ముఖ్యమా అని పలువురు వాహనదారులు,ప్రజలు ఆర్ అండ్ బి వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారిని మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


