ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్ఫుడ్ డాబాలపై అధికారుల తనిఖీలు ఎక్కడ..?ప్రజల ప్రాణాలతో చెలగాటమా..!

ఫుడ్ డాబాలపై అధికారుల తనిఖీలు ఎక్కడ..?ప్రజల ప్రాణాలతో చెలగాటమా..!

📰 Generate e-Paper Clip

♦️ఫుడ్ క్వాలిటీ నిల్…బిల్లుల వసూళ్లు మాత్రం ఫుల్..!

♦️ఫ్రిజ్‌లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసంతో వంటలు చేస్తున్నారనే ఆరోపణలు

♦️ఆహార భద్రతా నిబంధనలు బేఖాతరు..ప్రమాదంలో వినియోగదారుల ఆరోగ్యం

♦️డాబాల్లో బహిరంగంగా మద్యం సేవనం…అనుమతులు ఇచ్చిందెవరు

♦️పది రూపాయల శీతల పానీయాలను రూ.20 వరకు విక్రయిస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు

♦️ఫుడ్ సేఫ్టీ,ఎక్సైజ్,లీగల్ మెట్రాలజీ,పోలీసు శాఖలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్

కోట స్వర్ణసాగరం,జూలై 23:

కోట మండలం కోట,విద్యానగర్ ప్రధాన రహదారుల వెంట ఉన్న పలు ఫుడ్ డాబాల్లో ఆహార నాణ్యత,పరిశుభ్రత,నిబంధనల అమలు ప్రశ్నార్థకంగా మారిందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది డాబా నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు ఉపయోగిస్తూ,ఫ్రిజ్‌లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని వంటలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో వినియోగదారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధిక ధరలు వసూలు చేస్తున్నప్పటికీ,అందించే ఆహారంలో నాణ్యత,పరిశుభ్రత లేకపోవడం పట్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వంటశాలల పరిశుభ్రత,నిల్వ విధానాలు,ఆహార పదార్థాల నాణ్యతపై సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు,కొన్ని డాబాల్లో బహిరంగంగానే మద్యం సేవించడం సాధారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.కుటుంబాలతో భోజనం చేసేందుకు వచ్చే వారికి ఇది తీవ్ర అసౌకర్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డాబాల్లో మద్యం సేవించేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా?లేక అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందా?అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా,ఎంఆర్పీ రూ.10గా ముద్రించిన శీతల పానీయాల సీసాలను రూ.20 వరకు విక్రయిస్తూ కొందరు డాబా నిర్వాహకులు వినియోగదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై లీగల్ మెట్రాలజీ (తూనికలు,కొలతల శాఖ) అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.ప్రజల ఆరోగ్యం,భద్రతతో పాటు వినియోగదారుల హక్కులను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ,ఎక్సైజ్,లీగల్ మెట్రాలజీ,పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తున్న డాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఆహార నాణ్యత, పరిశుభ్రత,ధరల నియంత్రణ,చట్టబద్ధ అనుమతుల విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular