♦️స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నా క్షేత్రస్థాయిలో జాడలేని పార్టీ కార్యకలాపాలు
♦️సమావేశాలు లేవు..ప్రచారం లేదు..నాయకత్వంలో సమన్వయం కనిపించదు..!
♦️ప్రజల్లో పట్టును కోల్పోతోందా వైసీపీ..?రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
కోట స్వర్ణసాగరం జులై 20
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.ఎన్నికల వేళ సాధారణంగా క్షేత్రస్థాయిలో కనిపించాల్సిన పార్టీ సందడి, గ్రామాల వారీ సమావేశాలు,బూత్ కమిటీల ఏర్పాటు,కార్యకర్తల సమన్వయం,ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు,రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు గ్రామస్థాయిలో బలంగా పనిచేసిన పార్టీ కేడర్ ప్రస్తుతం పూర్తిగా నిస్తేజానికి గురైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం,స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపం,కార్యకర్తలను చైతన్యపరిచే ప్రయత్నాలు కనిపించకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేయడం,ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం,గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం వంటి అంశాల్లో వైసీపీ పూర్తిగా వెనుకబడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్‌తో నాయకులు ప్రత్యక్షంగా మమేకం కావడం లేదని స్థానికులు అంటున్నారు.ఇదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలు మాత్రం గ్రామస్థాయిలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ,ప్రజల్లోకి వెళ్లి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.దీనికి భిన్నంగా కోట మండలంలో వైసీపీ మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నా ఎలాంటి స్పష్టమైన వ్యూహం లేకుండా కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పార్టీలో చురుకైన నాయకత్వం లేకపోవడం, కార్యకర్తలకు దిశానిర్దేశం అందకపోవడం, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో కేడర్‌లో తీవ్ర నిరుత్సాహం నెలకొన్నట్లు సమాచారం.గతంలో పార్టీ కోసం శ్రమించిన పలువురు కార్యకర్తలు కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే,రాష్ట్రస్థాయిలో పార్టీ నాయకత్వం కేడర్‌ను మళ్లీ చైతన్యపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ,ఆ ప్రభావం కోట మండలంలో ఇప్పటివరకు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ కేడర్‌ను మళ్లీ సమీకరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోగలదా?లేక ప్రస్తుతం కనిపిస్తున్న నిస్తేజం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా?అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.


