స్వర్ణ సాగరం —తొట్టంబేడు,
శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి అవసరమని తొట్టంబేడు మండల ఎం.పీ.డీ.వో పి. సురేంద్రనాథ్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ స్టేడియంలో గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తుంటారని, అలాంటి వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే సమయం దొరికిన ప్పుడల్లా క్రికెట్ వంటి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. అలాగే మండలంలోని ప్రజలంతా సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



