- ఇదేనా కూటమి రాజకీయం
- ఎక్స్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అమరావతి : రాష్ట్రంలో కోడిని కోసిన వ్యక్తిని జైలుపాల్జేసి తీవ్రంగా కొట్టి రోడ్లపై నడిపించారని, అదే ఒక ఎంపి డ్రగ్స్ తీసుకుని దొరికితే హాట్‌లైన్లో బెయిలిప్పించి షోకాజ్ పేరుతో డ్రామా ఆడుతున్నారని వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సోమవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. డ్రగ్స్‌పై పోరాటం అంటూనే డ్రగ్స్ వాడుతూ యువతకు ఇచ్చే సందేశం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ దొరికారని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, డ్రగ్స్ శాంపిల్స్‌లో భాగంగా యూరిన్‌కు బదులు నీరు తీసుకున్నారనే విమర్శలూ ఉన్నాయని తెలిపారు. కొకైన్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో తేలిందని, ఇన్ని ఆధారాలుంటే ఎంపి పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, బెయిల్‌పై తీసుకురావడం అన్యాయమని తెలిపారు. చిన్న కేసుల్లో ఉన్న వ్యక్తులను కొట్టి రోడ్లపై నడిపించిన రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తీసుకున్న ఎంపిని రాజమార్గంలో పంపించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారని ఆరోపించారు. కమిటీల పేరుతో విచారణ, షోకాజ్ వంటి అంశాలను కట్టిపెట్టి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపితో తక్షణం రాజీనామా చేయించడంతోపాటు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



