♦️కోట ఎస్సీ గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్
కోట స్వర్ణసాగరం జులై 27
కోటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకులాన్ని ఎత్తివేయడాన్ని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ),బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించి,కోట ఎస్సీ గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,పేద,దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎస్సీ గురుకులాన్ని మూసివేయడం వల్ల వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా విద్యా సంస్థలను ఎత్తివేయడం సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే చర్య అని పేర్కొన్నారు.
కోట గురుకులాన్ని వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు అదే ప్రాంగణంలో విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.విద్య హక్కును కాలరాసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తమ వినతిపై సానుకూలంగా స్పందించి,ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరిన నాయకులు,గురుకులాన్ని తిరిగి ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సంఘాలు,విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ,బహుజన యూత్ ఫోర్స్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



